Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం బాంబు పేలుడు తీవ్ర కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్‌లో ఉంచిన ఒక నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో రైల్వే అధికారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పేలుడుకు కారణం ఏంటి?
ఉదయం రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో, రైల్వే ట్రాక్‌పై ఒక నల్లటి సంచి కనిపించింది. ఆ సంచిని చూసిన ఒక వీధి కుక్క, లోపల ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆ సంచిని నోటితో లాక్కెళ్లి, అందులోని ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న వస్తువును కొరికింది. అది నాటు బాంబు కావడంతో, కుక్క కొరకగానే భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి ఆ కుక్క క్షణాల్లో మరణించింది.
రైల్వే స్టేషన్‌లో భారీ శబ్దం రావడంతో, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న ప్రయాణికులు, రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మూడవ పట్టణ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్‌లోని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఆగంతకుడు ఎవరు, ఎటువైపు నుంచి వచ్చారు, ఎటు వెళ్లారు అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.
Also Read: Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు!
ఐదు నాటు బాంబులు స్వాధీనం
బాంబు పేలుడుకు సంబంధించిన తీవ్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ (జాగిలాలను) రంగంలోకి దించి రైల్వే స్టేషన్ అంతా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో, పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో మరో ఐదు నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇది రైల్వే అధికారులు, పోలీసులను మరింత కలవరపరిచింది.
రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రదేశంలో నాటు బాంబులు కనిపించడం వెనుక గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వేటగాళ్లు జంతువులను వేటాడటానికి ఇటువంటి నాటు బాంబులను ఉపయోగించడం సాధారణం. వాటిని ఇక్కడ పొరపాటున వదిలి వెళ్లారా లేదా ప్రయాణికులు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించేందుకు ఎవరైనా కుట్ర చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇచ్చారు. నాటు బాంబులు పెట్టిన వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

