Hyderabad: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఎస్సై సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పంచాయతీ ఎన్నికల విధులు ఉండటం వల్ల మంగళవారం రాత్రి ఆయన ఇంట్లో కాకుండా పోలీస్ స్టేషన్‌లోనే పడుకున్నారు. తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే గుండెపోటు రావడంతో, ఎస్సై సంజయ్ సావంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విని పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాచారంలో నివాసం ఉండే సంజయ్ సావంత్, బుధవారం రోజు అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరగబోయే ఎన్నికల విధులకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. విధుల్లో అంకితభావం ఉన్న అధికారి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. ఎస్సై మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఎస్సై మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

