Nadendla Manohar: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే ఏ చిన్న సమస్యకైనా రైతులు ఇకపై నేరుగా 1967 టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,77,934 మంది రైతుల నుంచి సుమారు 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 2,830 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని మంత్రి వెల్లడించారు. రైతులు ధాన్యం అమ్మే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు పడకుండా ఉండేందుకే, విజయవాడలోని కానూరు సివిల్ సప్లై భవనంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read: Lok Bhavan: రాజ్‌భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్
ఈ 1967 హెల్ప్‌లైన్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ముఖ్యంగా, ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, తూకం సమస్యలు, డబ్బులు పడకపోవడం, రవాణా ఇబ్బందులు, గోనె సంచుల కొరత, లేదా ఏదైనా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై రైతులు నేరుగా ఈ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు.
రైతులు ఫోన్ చేసేటప్పుడు తమ ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, టోకెన్ నెంబర్, గ్రామం పేరు, ఆర్.ఎస్.కే. వంటి ముఖ్యమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు నమోదు కాగానే, వెంటనే వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తారు. అంతేకాకుండా, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకోవాలని మంత్రి కోరారు.

