CM Revanth

Revanth Reddy: సోనియా, రాహుల్‌కు అండగా తెలంగాణ.. కేసులకు భయపడేది లేదు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం వైఖరిపై గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం తీవ్రంగా ఆరోపించారు. గాంధీ కుటుంబంపై పెట్టిన కేసులను ఖండిస్తున్నామని, వారి బెదిరింపులకు భయపడేది లేదని, దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ప్రారంభించారని, ఇందుకోసం ఆయన తన ఆస్తులను ఖర్చు చేశారని సీఎం వివరించారు. మూతబడ్డ ఈ పత్రికను పునరుద్దరించే ప్రయత్నంలో భాగంగానే, యంగ్ ఇండియా పత్రికతో పాటు, అందులోని ఉద్యోగులకు కేవలం పదవీ విరమణ కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిధుల నుండి ఇచ్చిందని తెలిపారు. ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానిది లేదనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. మనీలాండరింగ్ కేసులు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మానసికంగా వేధించడం సరైంది కాదన్నారు. ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాస్తామని, తెలంగాణ ప్రజలంతా గాంధీ కుటుంబానికి అండగా ఉంటారని ప్రకటించారు.

Also Read: Sridhar Babu: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో దూకుడు.. స్వయంగా రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు!

రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ, తమ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకోబోతోందని సీఎం తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించారని గుర్తు చేస్తూ, తాము రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దిగ్గజ నేతల సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. డీసీసీ పదవి పార్టీ ఇచ్చిన గౌరవమని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. నాటి పాలన ఎలా ఉండే, నేడు ఎలా ఉందనే తేడాను ప్రజల్లో చర్చ పెట్టాలని ఆయన కోరారు. మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన బతుకమ్మ చీరలిస్తే ప్రజలు తిట్టుకున్నారని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీరలు రానివారు సైతం మాకెందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారని ఉదహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు చీరలిస్తున్నామని, ప్రతి మహిళకు చీర అందేలా చూడాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము చూస్తున్నామని తెలిపారు.

అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా, ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని, దాని అభివృద్ధికి ఎంత ఖర్చైనా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని, 9న తెలంగాణ-2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. కోర్ అర్బన్‌ను (ప్రధాన పట్టణ ప్రాంతాన్ని) క్యూర్ చేయాలని నిర్ణయించామని, అందులో భాగంగా కాలుష్య కారక పరిశ్రమలన్నీ ORR (ఔటర్ రింగ్ రోడ్) బయటకు తరలిస్తున్నామని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణతో పాటు, ఇండస్ట్రీస్ తరలింపు ప్రధాన లక్ష్యాలని సీఎం వివరించారు. ఈ నెలలోనే వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ప్రణాళికలన్నీ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *