New Year 2026: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం 2026 రాబోతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌లోని పబ్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు భారీగా వేడుకలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో, హైదరాబాద్ పోలీసులు ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి అని పోలీసులు స్పష్టం చేశారు.
సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. ఈవెంట్ల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, వేరే ఏ పద్ధతిలోనూ అనుమతులు ఇవ్వబడవని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా cybpms.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు ఈ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సీపీ సూచించారు. 21వ తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను తాము పరిశీలించమని ఆయన స్పష్టం చేశారు. కమర్షియల్ ఈవెంట్ల కోసం ఒక ఫారం, నాన్ కమర్షియల్ వేడుకల కోసం మరొక ఫారం ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
సాధారణ ప్రజలకు కూడా సీపీ అవినాశ్ మహంతి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రజలు ప్రశాంతంగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా, డీజే సౌండ్స్ తక్కువగా పెట్టుకోవాలని, ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి రోడ్లపైకి వచ్చి కేకలు వేయడం, హంగామా చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు అన్నారు. రోడ్లపై నానా హంగామా చేసేవారిని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు రాత్రి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈవెంట్లు జరిగే చోట అగ్నిప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఏర్పాట్లు, అలాగే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

