CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు ఆయన ఢిల్లీలో పలువురు ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో 2026లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ స్థాయి నాయకులను స్వయంగా ఆహ్వానించేందుకే ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలసి సమ్మిట్‌కు ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే వివిధ శాఖల కీలక కేంద్ర మంత్రులను కూడా అధికారికంగా ఆహ్వానించనున్నారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ఏఐ, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం మొత్తం ఈ వేదికపైకి రావాలనే ఉద్దేశంతోనే సీఎం స్వయంగా ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
సమ్మిట్ ఆహ్వానాలకే కాకుండా, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, ఫండింగ్, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల కేటాయింపులు వంటి ముఖ్య విషయాలపై కూడా చర్చలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వంటి అంశాలను సీఎం నేరుగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
సీఎం పర్యటన షెడ్యూల్, ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు ఉదయం పార్లమెంట్ భవనాన్ని సందర్శించి ప్రధాని మోదీతోపాటు పలువురు జాతీయ నాయకులతో సమావేశాలు జరుపుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. తిరిగి వచ్చిన వెంటనే సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్‌లో జరుగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

