Ponnam Prabhakar: ఎన్నికల్లో విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు హుస్నాబాద్‌కు పర్యటనకు వస్తున్నారు. ఈ సభ ఉమ్మడి కరీంనగర్‌తో పాటు సిద్దిపేట, హనుమకొండ జిల్లాల ప్రజలకు కూడా అత్యంత ప్రాధాన్యంగా మారింది. గ్రామాల నుండి ప్రజలు స్వయంగా సభకు హాజరయ్యేందుకు ముందుకు వస్తుండగా, ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, పూర్తిగా ప్రజలే ఉత్సాహంతో వస్తున్నారని అధికారులు తెలిపారు.
సభలో ముఖ్యమంత్రి విద్య, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే అవకాశముందని సమాచారం. కోడ్ కారణంగా ఇబ్బందులు లేకపోతే గౌరవెల్లి భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేపడతామని వెల్లడించారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు విషయంపై స్పందిస్తూ, ఈడి, ఇతర కేంద్ర సంస్థలు బీజేపీ అనుబంధాల్లా ప్రవర్తిస్తూ రాజకీయ వేధింపులు చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ధైర్యం రాహుల్ గాంధీకి ఉండటమే ఇలాంటి కేసులతో ఒత్తిడి తెచ్చేందుకు కారణమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఖండించారు.
హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ, నీటి వనరులు, తక్కువ కాలుష్యం వంటి అంశాలతో హైదరాబాద్ దేశంలోని ప్రముఖ నగరాల్లో మంచి భవిష్యత్తు సాధించగలదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 2047 విజన్‌తో ముందుకు సాగుతుందని, తెలంగాణను అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించి సమగ్రమైన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.
రాబోయే హుస్నాబాద్ సభ విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటన నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

