Vizag విశాఖపట్నంలోని కైలాసగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను సోమవారం ప్రారంభించారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బలమైన నిర్మాణం – జర్మనీ నుంచి ప్రత్యేక గాజు
ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో 40 మిల్లీమీటర్ల మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఈ గాజును ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేశారు. బ్రిడ్జ్ బలం పరంగా ఒకేసారి 500 టన్నుల వరకు బరువును మోయగలగడం, అలాగే 250 కి.మీ. వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునే సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. భద్రతా పరంగా ఒకేసారి 40 మంది వరకు బ్రిడ్జ్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
పర్యాటక అభివృద్ధికి పెద్ద పీట
వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ— విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా నిలబడగల స్థాయిలో గ్లాస్ బ్రిడ్జ్‌ను నిర్మించామని చెప్పారు. త్వరలోనే కైలాసగిరిలో త్రిశూల్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
