CM Chandrababu

CM Chandrababu: ఏపీ పునర్నిర్మాణం: సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పునర్నిర్మాణంపై తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, వీటిని విజయవంతం చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నల్లమాడులో జరిగిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

సంక్షేమ పథకాలు, ఆర్థిక భారం
ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రజలు తమ హామీలను నమ్మి 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో కూటమిని గెలిపించారని గుర్తుచేశారు. సుపరిపాలనకు శ్రీకారం చుడతామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం అసాధ్యమని కొందరు విమర్శించినప్పటికీ, తమ ప్రభుత్వం వాటిని సూపర్ సక్సెస్ చేసిందని ప్రకటించారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ల కోసం ఏపీ అధికంగా ఖర్చు చేస్తోందని, ఏడాదికి దాదాపు రూ. 33 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వంద మందిలో పదమూడు మందికి పింఛన్లు అందుతున్నాయని, వీరిలో 59 శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ. 4 వేలకు పెంచామని, గత ప్రభుత్వం కేవలం రూ. 250 చొప్పున మాత్రమే పెంచిందని గుర్తు చేశారు. అలాగే, రెండు, మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు. తాము ఇస్తున్న ఉచిత సిలిండర్ల పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (‘స్త్రీశక్తి’), ‘తల్లికి వందనం’ వంటి పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఇప్పటికే 25 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, ఈ పథకం కోసం రూ. 550 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

Also Read: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ఈడీ నోటీసులు..రూ.2వేల కోట్ల మసాలా బాండ్‌ కేసు

పాలనలో మార్పు, అభివృద్ధి లక్ష్యాలు
పాలన విషయానికి వస్తే, గ్రామ సభలు కేవలం మొక్కుబడిగా ఉండకుండా, ప్రజల జీవితంలో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల వివరాలు తప్పనిసరిగా సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, పోలవరం కుడి కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీరందిస్తామని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు.

రైతుల ఆదాయం పెంచడం కోసం తమ ప్రభుత్వం పంచ సూత్రాలతో కూడిన సమీకృత వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తోందని, దీనివల్ల ఆరోగ్యం, ఆదాయం మెరుగుపడతాయని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా పంటలు, మందుల వినియోగం, నీటి సంరక్షణపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నామని చెప్పారు. కొల్లేరు సరస్సు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, తద్వారా గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు పెట్టిన రూ. 1650 కోట్ల బకాయిలను తీర్చడమే కాకుండా, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా నాలుగు గంటల్లోనే డబ్బులు ఇస్తున్నామని వివరించారు.

Also Read: Rain Alert: ఆంధ్రాలో ‘దిత్వా’ తుఫాన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

అమరావతి నిర్మాణం, ఇతర హామీలు
అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని, 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి అవుతాయని, ఇది ప్రపంచంలోనే సుందర రాజధానిగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రోడ్ల మరమ్మతులపై ఉన్న సమస్యలను అంగీకరించి, జనవరిలోపు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, జిల్లాకు పరిశ్రమలు రావాలని, కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో మహిళలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలను తీసుకొస్తామని పేర్కొన్నారు.

అధికారుల తీరుపై అసంతృప్తి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా గ్రామ సభకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దని, గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆదాయం పెంచే విధంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చివరగా, తనను, కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్లు అధికారంలో ఉంచాలని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *