Panchayat Elections: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కోలాహలం నెలకొన్నది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రెండో విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 2వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా, డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల గడువు ఉన్నది. ఈ దశలో తొలి విడత సర్పంచ్ పదవులకు ఏకగ్రీవాలు పెద్ద ఎత్తున జరిగాయి. వాటిలో వేలంలో నిర్వహించినవి కూడా చాలా వరకు ఉన్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ పంచాయతీకి వేలం నిర్వహించినట్టు వెలుగులోకి వచ్చింది.
Panchayat Elections: నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవం అయినట్టు ప్రచారం జరుగుతుంది. 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, అందరితోనూ నామినేషన్ను ఉపసంహరించుకునేలా గ్రామస్తులు ఒప్పందపత్రాలు రాయించుకున్నారు. ఆ తర్వాత వేలం పాట నిర్వహించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.73 లక్షలకు ఒకరు వేలంలో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.
Panchayat Elections: వేలంలో వచ్చిన సొమ్ముతో గ్రామ పరిధిలో కనకదుర్గ ఆలయ నిర్మాణం, ఇతర గ్రామాభివృద్ధి పనులకు కేటాయించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ వేలంలో గ్రామానికి చెందిన మహ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి కుటుంబం దక్కించుకున్నది. ఏకగ్రీవమైన బంగారిగడ్డ గ్రామం పంచాయతీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది.

