Suicide Mystery: ఆంధ్రప్రదేశ్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసంలో ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే, ఆమె మరణంపై భర్త రాజేష్, తండ్రి చిన్నరాముడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో ఈ కేసులో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కులాంతర వివాహం… ఆపై వేధింపులు?
మాధురి మృతికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, సుమారు 8 నెలల కిందట కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగు నెలల్లోనే అత్తింటి వారి వేధింపులు భరించలేక మాధురి పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గర్భవతి అయిన మాధురి, సుమారు మూడు నెలల కిందట తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మాధురి, తాజాగా తాడేపల్లిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాల్టీల విలీనం.. నేడు అధికారికంగా ఆర్డినెన్స్ విడుదల
భర్త రాజేష్ ఆరోపణలు.. “ప్రాణహాని” వాట్సాప్ మెసేజ్!
మాధురి మరణంపై ఆమె భర్త రాజేష్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాధురి ఆత్మహత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని, అత్తమామలపై అనుమానం ఉందని ఆయన ఆరోపించారు. మాధురి మరణానికి కొన్ని రోజుల ముందు, తమ ఇద్దరికీ ప్రాణహాని ఉందని మాధురి వాట్సాప్ ద్వారా తనకు మెసేజ్ పంపిందని రాజేష్ వెల్లడించారు. తన భార్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Samantha: నా భర్తతో సమంత పెళ్లి!.. రాజ్ మాజీ భార్య శ్యామలి పోస్ట్ వైరల్..?
తండ్రి చిన్నరాముడి సంచలన వ్యాఖ్యలు..
మరోవైపు, కుమార్తె మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఐఏఎస్ అధికారి చిన్నరాముడు, తన బిడ్డను రాజేష్ మోసం చేసి పెళ్లి చేసుకోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపించారు. రాజేష్ వేధింపులతోనే మాధురి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి స్పష్టం చేశారు. నా బిడ్డది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు. తానే దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. రాజేష్ నా కూతురిని ట్రాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. విలాసాలకు అలవాటు పడి రాజేష్ అమ్మాయిలను మోసం చేస్తున్నారు అన్నారు. అంతకు ముందు కూడా మరో అమ్మాయిని ఇలానే ట్రాప్ చేసి మోసం చేశాడు అని ఆరోపించాడు. రాజేష్‌కు తనతో పడని వారి వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టే హాబీ ఉంది అంటూ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు పేరుకున్నారు.
విచారణకు డిమాండ్
రాజేష్ మోసపూరిత చర్యలు, వేధింపులు, ఆపై తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగానే మాధురి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందనేది ఆమె తండ్రి ఆరోపణ. దీనికి విరుద్ధంగా, అత్తమామలే తన భార్య మృతికి కారణమని, వారికి ప్రాణహాని ఉందని మాధురి చివరిసారిగా మెసేజ్ చేసిందని భర్త రాజేష్ పేర్కొంటున్నారు.
దీంతో మాధురి మృతి వెనుక అసలు కారణాలు ఏంటి, ఆమె ఆత్మహత్యకు పుట్టింటి వాతావరణం కారణమా, లేక రాజేష్ వేధింపులు కారణమా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
