Botsa Satyanarayana

Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల కష్టాలు.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు సరైన సహాయం అందడం లేదని, వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.

విత్తనం నుండి విక్రయం వరకు కష్టాలే
రైతులు పంట పండించడానికి మొదటి నుండీ ఎన్నో కష్టాలు పడుతున్నారని బొత్స గుర్తు చేశారు. పంటకు కావాల్సిన ఎరువుల కోసం రైతులు, రైతు కూలీలు ఎంతలా కొట్లాడారో, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఎరువులు కొనుక్కోవాల్సి వచ్చిందో మనం చూశామన్నారు. కష్టపడి పంట పండించినా, అది చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయారు. అయితే, ఆ నష్టం నుంచి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని బొత్స ఎద్దేవా చేశారు.

ఇక, పంట చేతికొచ్చాక అమ్ముకోవాలంటే కూడా గత ఏడెనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అరటి, మొక్కజొన్న, పొగాకు, పత్తి లాంటి ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్రలో చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా వేసే మొక్కజొన్నను కొనే విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలులో సమస్యలు వస్తే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారని బొత్స గుర్తు చేశారు.

కేంద్రానికి లేఖలు కాదు, రాష్ట్రమే ఆదుకోవాలి!
ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతుల బాధలు ఏమాత్రం పట్టడం లేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. రైతులు నష్టపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేంద్రానికి లేఖలు రాయడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. మొదట రాష్ట్ర ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, ఆ తర్వాత కేంద్రం నుంచి ఆ డబ్బును తిరిగి పొందాలని తెలిపారు. ఇది అనాదిగా వస్తున్న పద్ధతి అని, కానీ నేటి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి లేదని బొత్స అన్నారు.

రైతుల సమస్యలపై ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తుంటే, ‘రాజకీయం చేస్తున్నాం’ అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టాలతో సతమతం అవుతుంటే, వారిపై ఎందుకు ఇంత చిన్నచూపు, ఎందుకు ఈ అలసత్వం అని బొత్స ప్రభుత్వాన్ని నిలదీశారు.

వ్యవసాయ మంత్రి ఆలోచించాలి..
వ్యవసాయ శాఖ మంత్రి ఈ పరిస్థితిపై ఆలోచించాలని, మీరు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కదా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరారు. ముఖ్యమంత్రికి రైతులన్నా, వారి సమస్యలన్నా పట్టడం లేదని, ఆయన పెద్ద పెద్ద విషయాల గురించే ఆలోచిస్తుంటారని విమర్శించారు. విశాఖపట్నంలో ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయో చూసి, వాటిని తక్కువ ధరకే ఇచ్చేద్దామనే ఆలోచనలో, అలాగే ‘బ్యాక్ డోర్’ ద్వారా ఏ విధంగా దోచుకుందామనే ఆలోచనలో మాత్రమే ముఖ్యమంత్రి ఉంటారని తీవ్ర ఆరోపణలు చేశారు.

రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని బొత్స ప్రశ్నించారు. ఇప్పటికే 70 నుంచి 80 శాతం పంటను రైతులు ప్రైవేట్ మార్కెట్లలో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉందని, వ్యవసాయ స్థితిగతులు మారాల్సిన అవసరం ఉందని ఆయన తన వ్యాఖ్యలు ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *