iBomma Ravi

iBomma Ravi: నా బొమ్మకు నేనే సుప్రీమ్‌.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ పేర్ల వెనుక స్టోరీ ఇదే..

iBomma Ravi: రెండు తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు రెండో విడత కస్టడీలో విచారించిన పోలీసులు, శనివారంతో రవి కస్టడీ ముగియడంతో అతడి కీలక వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే తాను ఈ పైరసీ మార్గాన్ని ఎంచుకున్నానని రవి అంగీకరించాడు.

‘నేనే కారణం.. డబ్బే లక్ష్యం’

ఈ ప్రపంచంలో ఎవరితోనూ నాకు సంబంధం లేదు. పైరసీ సినిమా వెనుక జరిగిన ప్రతి అంశానికీ నేనే కారణం అని ఇమంది రవి పోలీసు విచారణలో స్పష్టం చేశాడు. కేవలం డబ్బు సంపాదించాలనే దురాశతోనే సినిమాల పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు రవి నిర్భయంగా ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారానికి తానే పూర్తి బాధ్యుడినంటూ అతడు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు.

విజయ్ దేవరకొండకు అహంకారపూరిత సవాల్

2023లో సినీనటుడు విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషీ‘ సినిమా పైరసీ చేసినపుడు, ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి ఆ హీరోకు సవాల్ విసిరినట్లు తాజా విచారణలో బయటపడింది. ఆనాటి ప్రకటన వివరాలను పోలీసులు బహిర్గతపరిచారు.

మా టీమ్ ముందే చెప్పింది. మా మీద ఫోకస్ చేస్తే.. మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని. కానీ మీరు మా మాట వినలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్‌ఎఫ్‌ డాట్‌ ఇన్‌ పేరుతో రన్ చేస్తున్నారు. అందుకే మీ కింగ్‌డమ్ సినిమా బయటకు తెస్తాం అంటూ రవి అప్పట్లోనే విజయ్ దేవరకొండను హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకటన రవి అహంకారపూరిత మనస్తత్వాన్ని, సినీ పరిశ్రమపై అతడి కక్షపూరిత ధోరణిని తేటతెల్లం చేసింది.

ఇది కూడా చదవండి: Tollywood: రియాలిటీ కి వచ్చిన హీరోయిన్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న టాల్ బ్యూటీ

‘ఐబొమ్మ’, ‘బప్పం’ పేర్ల వెనుక స్టోరీ

పైరసీ సినిమాల డొమైన్లకు పెట్టిన పేర్ల వెనుక ఉన్న అసలు కథను కూడా రవి పోలీసుల విచారణలో వెల్లడించాడు.

  • ఐబొమ్మ: విశాఖలో సినిమా థియేటర్‌లోకి వస్తే ‘బొమ్మ పడింది’ అనేవారు. దాంతో డొమైన్‌కు ఐబొమ్మ పేరు ఎంచుకున్నా. ఐబొమ్మ అంటే ‘నా బొమ్మ’ అని అర్థం.

  • బప్పం: బప్పం అంటే సుప్రీమ్‌ అని అర్థం. నా బొమ్మకు నేనే సుప్రీమ్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆ పేరును ఎంపిక చేసుకున్నా అని నిందితుడు వివరించాడు.

పైరసీ ఆపరేషన్ తీరు

ఐబొమ్మ ఆపరేషన్‌ను కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించినట్లు రవి తెలిపాడు. డొమైన్ల నిర్వహణ, డిజైనింగ్ వంటి పనులను కరేబియన్, యూకేలలో ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించినట్లు అతడు వెల్లడించాడు.

ఇక, సినిమాల సోర్సింగ్ విషయానికొస్తే.. డొమైన్లలో అప్‌లోడ్ చేసిన కొత్త సినిమాలను టెలిగ్రామ్ యాప్‌ల నుంచి కొనుగోలు చేయడంతో పాటు, కొన్నిసార్లు ఓటీటీ వేదికలపై రికార్డ్ చేసి, పలు సాఫ్ట్‌వేర్ల సాయంతో వాటిని హెచ్‌డీ క్వాలిటీగా మార్చి అప్‌లోడ్ చేసినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినీ పరిశ్రమకు తీరని నష్టాన్ని కలిగించిన ఈ వ్యవహారంలో రవి నేరాంగీకారం, అతడి కార్యకలాపాల వివరాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *