Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారం అంతులేని కథలా తయారైందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని అమరావతి రైతులు గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. అయితే, ఆ రైతుల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందని రాంబాబు విమర్శించారు. రైతులను ఒక కష్టం నుంచి తీసి మరో కష్టంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి ప్రాంతంలో రైతులు ఇప్పటికే దాదాపు 35 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే గొప్ప రాజధాని కడతామని చంద్రబాబు గతంలో గొప్పలు చెప్పారు. అయితే, ఇప్పుడు రెండో దశలో మరో 16,666 ఎకరాలు, ప్రభుత్వ భూములతో కలిపి 20 వేల ఎకరాలు సేకరించాలని కేబినెట్‌లో చర్చించారని, మూడో దశ కూడా ఉంటుందని అంటున్నారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. భూములు తీసుకునే సమయంలో ఇన్ని దశల్లో భూసేకరణ ఉంటుందని రైతులకు ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.
Also Read: Nagarkurnool: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ రచ్చ.. బాధితుడే నిందితుడిగా మారడం విషాదం!
రైతులకు ఫ్లాట్స్ ఇవ్వలేదు, దోచుకోవడమే పని
రైతులకు ఇంత కాలం గడిచినా వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను ఇవ్వలేదని అంబటి రాంబాబు తెలిపారు. అసలు నిర్మాణంలో లేని, అభివృద్ధి కాని ప్రాంతాలలో ఫ్లాట్స్ ఇస్తామని చెబుతున్నారన్నారు. రైతులకు సరైన సమాధానం చెప్పేవారే లేరని, కనీసం ఏ ఒక్క మంత్రి కూడా రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించలేదని మండిపడ్డారు. గతంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కడతామన్న చంద్రబాబు, ఇప్పటివరకు కేవలం 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ వస్తే భూముల ధరలు పెరుగుతాయని రైతులు ఆశపడ్డారని, కానీ ఎక్కడా ధరలు పెరగలేదని అన్నారు.
మొబలైజేషన్ అడ్వాన్స్‌లు, రీ-టెండర్లు
అమరావతి పేరు చెప్పి చంద్రబాబు కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు గట్టిగా ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారని, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో 3 వేల కోట్లు ఇచ్చి, ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి భారీగా కమీషన్లు కొట్టేశారని ఆయన ఆరోపించారు. గతంలో 41 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే, కేవలం 5 వేల కోట్ల పనులు మాత్రమే చేయించారని, ఇప్పుడు ఆ పనులకు మళ్లీ రీ-టెండర్లు పిలిచారని చెప్పారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 35 వేల కోట్ల పనుల విలువను ఇప్పుడు 48 వేల కోట్లకు పెంచారని, దీని వెనుక కేవలం దోచుకోవాలనే ఆలోచన మాత్రమే ఉందని అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కేవలం దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

