Breakfast Meeting: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన ముఖ్యమంత్రి (సీఎం) మార్పు అంశం నేడు (శనివారం) కీలక మలుపు తిరగనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్తో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ ఇద్దరు కీలక నేతలు సమావేశం అవుతుండడంతో, ఈ భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హైకమాండ్ సూచనతో సమావేశం:
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. పార్టీ హైకమాండ్ తమ ఇద్దరినీ (సిద్ధరామయ్య, శివకుమార్) సమావేశమై చర్చించుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను శనివారం ఉదయం 9:30 గంటలకు తన నివాసానికి ఆహ్వానించారు.
సిద్ధరామయ్య ట్విట్టర్ ద్వారా తన వైఖరిని స్పష్టం చేస్తూ, “పార్టీ సీనియర్ల సూచనల మేరకు నేను నడుచుకుంటాను. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటాను” అని పునరుద్ఘాటించారు. డీకే శివకుమార్ కూడా అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరిస్తానని ఇప్పటికే ప్రకటించారని ఆయన తెలిపారు. చర్చల కోసం ఢిల్లీకి పిలిస్తే వెళ్తానని కూడా సిద్ధరామయ్య పేర్కొన్నారు.
డీకే శివకుమార్ మౌనం – వ్యూహాత్మక వ్యాఖ్యలు:
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తాను దేనికీ ఆత్రుత చూపనని, అంతా పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని ఆయన బెంగళూరులో మీడియాతో వ్యాఖ్యానించారు.
అయితే, శుక్రవారం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ… సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరడం గమనార్హం. ఇది ఆయన ప్రస్తుత సీఎంకు మద్దతుగా మాట్లాడినట్లుగా కనిపిస్తున్నా, రాజకీయ వర్గాల్లో దీనిపై భిన్న చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో నిర్ణయం… కురుబ సామాజిక వర్గం హెచ్చరిక:
సీఎం మార్పుపై అంతిమ నిర్ణయం ఢిల్లీ నుంచే రానుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ఉన్నప్పటికీ, సోనియా గాంధీ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఆమె ఆదివారం రోజున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయిన తర్వాత సిద్ధరామయ్య, శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
మరోవైపు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని కురుబ సామాజిక వర్గం చేసిన హెచ్చరిక పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
నేడు సీఎం నివాసంలో జరగబోయే ఈ బ్రేక్ ఫాస్ట్ భేటీ తర్వాత కర్ణాటక పాలిటిక్స్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

