Lionel Messi

Lionel Messi: తెలంగాణకి ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ!

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో GOATగా పేరొందిన అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ, ఈ డిసెంబర్‌లో భారతదేశ పర్యటనకు రానున్నారు. ‘ది GOAT ఇండియా టూర్ – 2025’లో భాగంగా, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కూడా సందర్శించనున్నారు. ఫుట్‌బాల్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప, అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ అనే గ్లోబల్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న మెస్సీ.. భారతదేశంలో ఒక్క బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ కోసమే సంవత్సరానికి వంద కోట్లకు పైగా తీసుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి ప్రపంచ సూపర్ స్టార్‌ను తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాలకు అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కీలకమైన అడుగు.

మెస్సీ పర్యటన షెడ్యూల్ వివరాల విషయానికి వస్తే, ఆయన తన ‘GOAT టూర్ – 2025’లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు విచ్చేస్తారు. ఈ టూర్‌లో మెస్సీతో పాటు, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్ వంటి ఇతర స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో అదే రోజు రాత్రి 7:30 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మెస్సీ చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి, 7v7 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి, అభిమానులు వేగంగా కొనుగోలు చేస్తున్నారు.

ఈ టూర్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. డిసెంబర్ 13న ఉదయం 10.30కి కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియం, డిసెంబర్ 14 సాయంత్రం 5.30కి ముంబై వాంఖడే స్టేడియం, డిసెంబర్ 15 మధ్యాహ్నం 1.00కి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలను కూడా మెస్సీ సందర్శించనున్నారు. ఈ పర్యటనలో 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, యువ క్రీడాకారుల కోసం మెస్సీ మాస్టర్‌క్లాస్, పెనాల్టీ షూటౌట్స్, మ్యూజిక్ కన్సర్ట్‌లు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

Also Read: Ayyappa devotees: శబరిమల భక్తులకు గొప్ప శుభవార్త.. ఇక ఇరుముడి విమానంలో మీతో పాటే!

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “లియోనెల్ మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మన గడ్డపై ఆయనను చూడాలనే ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కల ఈ సందర్భంగా నిజమవుతోంది. హైదరాబాద్ అతనికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో జరగబోయే ఈ టూర్, హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఒక గొప్ప వేదికగా మారనుంది. మెస్సీ రాకతో నగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత పెరగడం ఖాయం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *