Jagga Reddy

Jagga Reddy: రాహుల్ గాంధీది కుటుంబంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు!

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి బీజేపీ నాయకులపై, ముఖ్యంగా బీజేపీ నేత లక్ష్మణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, గాంధీ కుటుంబం గురించి మాట్లాడేందుకు లక్ష్మణ్‌కు అనుభవం, అవగాహన, చరిత్రపై గౌరవం లేవని మండిపడ్డారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు. అంటే ఆయన పుట్టకముందే ఎన్నో చరిత్రలు జరిగాయి. అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారి కుటుంబంలో మూడు ఎంపీ సీట్లు ఎందుకని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 ఏళ్లు అవుతుంటే, బీజేపీ పార్టీ పుట్టి కేవలం 40 ఏళ్లు మాత్రమే అయ్యిందని, కాంగ్రెస్ చరిత్రకు, బీజేపీ చరిత్రకు 100 ఏళ్ల తేడా ఉందని ఆయన గుర్తుచేశారు. అర్హత లేని వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటైపోయింది అని ఆయన దుయ్యబట్టారు.

అంతేకాకుండా, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు దేశం మొత్తానికి తెలుసని, మీ బీజేపీలో అలాంటి త్యాగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. లక్ష్మణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, నోరు ఉంది అని ఎవరిపైనా మాట్లాడకూడదు. ముందుగా మీ అమ్మానాన్నలను అడుగు, గాంధీ కుటుంబం అంటే ఏమిటో వాళ్ళతో తెలుసుకో. దేవుళ్ల తర్వాత దేవుళ్ళు వాళ్లే అని చెబుతారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లక్ష్మణ్‌కు స్వయంగా 3-4 పదవులు వచ్చాయని, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారని, మరి ఆయన దేశం కోసం ఏం చేశారో చెప్పాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీని విమర్శించడం ఏం న్యాయం? అని అన్నారు. అలాగే, మోడీ ప్రధాని అయ్యి 12 ఏళ్లు అవుతున్నా, దేశానికి ఏ పెద్ద కంపెనీని, ఏ పెద్ద పరిశ్రమను, ఏ మేజర్ డెవలప్‌మెంట్‌ను తెచ్చారో చెప్పాలని ఆయన సవాలు విసిరారు.

ఓపెన్ డిబేట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. మేము ఏం చేశాం, మీ మోడీ ఏం చేశాడు అనేది ప్రజల ముందే చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తుందని, రెండోసారి, మూడోసారి కూడా దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. చివరగా, తాను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్‌ను కాదని స్పష్టం చేస్తూ, రాజకీయాల్లో అలిగినవాడు బుద్ధి తక్కువ వాడవుతాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *