Prakasam district: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, కొలుకుల గ్రామంలో ఒక విచిత్రమైన పెళ్లి ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ ఆచారంలో భాగంగా, వివాహం జరిగిన మరుసటి రోజు వధువును అబ్బాయిలా, వరుడిని అమ్మాయిలా అలంకరించి ఊరేగింపు చేస్తారు.
యాదవ కులానికి చెందిన బత్తుల శివగంగరాజు, నందినిల వివాహం ఇటీవల జరిగింది. శుక్రవారం నాడు ఈ వింత ఆచారాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లికుమారుడు శివగంగరాజును రంగురంగుల చీరలు, నగలు ధరింపజేసి పెళ్లికూతురులా ముస్తాబు చేయగా, వధువు నందినిని పంచె, షర్టు ధరింపజేసి పెళ్లికొడుకులా అలంకరించారు.
ఈ విధంగా అలంకరించిన నూతన వధూవరులను ఊరి వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ వింత వేషధారణలో ఉన్న వారిని చూసేందుకు గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు తర్వాత, వారిద్దరితో జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ ఆచారం తమ కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని, దీనిని తప్పకుండా పాటించడం తమకు ముఖ్యమని వధూవరుల కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వింత వేషధారణ వెనుక ఉన్న కారణాలు ఏమైతేనేం, ఈ ఆచారం కొలుకుల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది అనడంలో సందేహం లేదు. ఈ విధంగా వైవిధ్యమైన ఆచారాలతో మన సంస్కృతి ఎంత ప్రత్యేకమైనదో మరోసారి మనకు అర్థమవుతోంది.
