Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాడు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా బ్యాంకుల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇది అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని అభివర్ణించారు.
ఆర్థిక బలోపేతానికి కేంద్రం సహకారం మరువలేనిది
ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనివని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా, జవాబుదారితనం మరియు మంచి సారథ్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అతి త్వరలోనే అమరావతి ఒక శక్తిమంతమైన ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణానికి రైతులు భూములను కేటాయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రధాని మోడీ అనేక సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అమరావతిలో ఎక్కడా లేని విధంగా 1300 కోట్ల పెట్టుబడితో, 6500 ఉద్యోగాల కల్పనతో ఒక రికార్డు సృష్టించడం దేశంలోనే అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన నిర్మలా సీతారామన్ గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11 వేల కోట్ల రూపాయలు, అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు మంజూరు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. అమరావతి రైతులు ఎక్కడా ఆందోళన చెందొద్దని, వారి కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
