Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా, నేడు నగరంలో జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న లేదా సరిగా లేని ప్రధాన కార్యాలయాలకు ఇకపై అమరావతి చిరునామా కానుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11.22 గంటలకు మొత్తం 15 ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్ హాజరుకానున్నారు.
భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు
ఈ 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుతో రాజధానిలో మొత్తం రూ. 1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యాలయాల్లో దాదాపు 6,514 మంది ఉద్యోగులు కొలువుదీరనున్నారు, ఇది అమరావతి అభివృద్ధికి కీలకమైన మైలురాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్ (NABARD), ఏపీ గ్రామీణ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (NIACL) వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం ప్రాంతాల పరిధిలో ఈ కార్యాలయాలు తమ శాశ్వత భవనాలను నిర్మించుకోనున్నాయి. ముఖ్యంగా SBI రూ. 300 కోట్లతో అతిపెద్ద భవనాన్ని నిర్మించి 2 వేల ఉద్యోగాలను కల్పించనుంది.
Also Read: KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు యుద్ధం 2028లోనే!
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రణాళిక
రాజధానిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటును సీఆర్డీఏ వేగవంతం చేసింది. కార్యాలయాలు, సిబ్బంది నివాసాలు, అనుబంధ సంస్థల కోసం మొత్తం 27.8 ఎకరాల స్థలాన్ని మూడు విభాగాలుగా కేటాయించారు. కేవలం బ్యాంకులు, కార్యాలయ భవనాలకు 9.695 ఎకరాలు, సిబ్బంది వసతి కోసం 11.56 ఎకరాలు కేటాయించబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఆదాయపు పన్ను శాఖ వంటి కీలక సంస్థలు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి.
పోలవరంపై కేంద్ర సహకారం కోరిన సీఎం
ఆర్థిక సంస్థల శంకుస్థాపన అనంతరం, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. పోలవరం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను పూర్తిచేయడానికి, అలాగే పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్సుగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు రూ. 58,700 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి ఆర్థిక సహకారం అందించాలని కోరనున్నారు.
