Minister Ponnam: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుబడి ఉందని, అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
న్యాయపరమైన అడ్డంకులు, ప్రభుత్వ ప్రయత్నాలు
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అనే కోర్టు తీర్పుల గురించి ప్రతిపక్షాలకు తెలిసి కూడా, కోర్టుల్లో రిజర్వేషన్ ప్రక్రియ నిలిచిపోతే వారు ‘రాక్షస ఆనందం’ పొందుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ 50 శాతం పరిమితి సమస్య ఉందని గుర్తుచేశారు. ఈ న్యాయపరమైన అడ్డంకులను తొలగించడానికి, ప్రభుత్వం సమగ్రమైన డేటా, నివేదికలను సేకరించి కోర్టులో బలంగా వాదిస్తున్నామని పొన్నం ప్రభాకర్ వివరించారు.
ప్రభుత్వం హామీ: “ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లతోనే జరపాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. బీసీల కోసం పోరాడేది కాంగ్రెస్ మాత్రమే, ఇతర పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాయి.”
Also Read: Telangana High Court: సిగాచీ పేలుడు కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
బీఆర్ఎస్ వైఖరి కోర్టులో రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరూ ‘ఇంప్లీడ్’ (పిటిషనర్‌గా చేరడం) కాలేదని మంత్రి ప్రశ్నించారు. సిగ్గులేకుండా బయట మాత్రం విమర్శలు చేస్తున్నారని, బీసీ సర్వేలో కూడా పాల్గొనని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు.
బీజేపీ వైఖరి: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ 42 శాతం రిజర్వేషన్లు గంటలోనే అమలు అయ్యేవని పొన్నం వ్యాఖ్యానించారు. ఈ 42 శాతం రిజర్వేషన్లలో ఉన్నవారంతా హిందువులే కాబట్టి, కనీసం హిందువుల కోసమైనా కేంద్రంలో బిల్లు పెట్టేలా బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్ కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పించేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నం చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు.
రాజ్యాంగం ఏం చెబుతుందో ప్రతిపక్షాలు తెలుసుకోవాలని, రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని మంత్రి హితవు పలికారు. గిరిజన ప్రాంతాల్లో వారికి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.
