Amaravati

Amaravati: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Amaravati: అమరావతి రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద జరిగించిన ఈ పవిత్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రెండు దశల్లో మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. తిరుమల శైలిలోనే అమరావతిలో దేవాలయం తీర్చిదిద్దాలని ఈసారి ప్రభుత్వం నిర్ణయించింది.

భూమిపూజ అనంతరం సీఎం మాట్లాడారు. 2019లోనే ఈ ఆలయం నిర్మించాలని సంకల్పం చేశామని, ఈ ప్రాంతానికి ‘వెంకటపాలెం’ అనే పేరు పెట్టినప్పుడు వేంకటేశ్వర స్వామి తనకు సంకల్పం ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని అభివృద్ధి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని, వారి త్యాగం వల్లనే అమరావతిలో ఈ పవిత్ర పనులు కొనసాగుతున్నాయని అభినందించారు. పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.

తప్పు చేసిన వారిని వేంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారని, తాను ఎప్పుడూ కూడా స్వామికి అపచారం అయ్యే పనులు చేయనని, అలాంటి పనులను ఎవరితోనూ చేయనివ్వనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిరుమలలో ఎప్పుడు దర్శనానికి వెళ్లినా భక్తుడిగానే క్యూ లైన్‌లో నిలబడతానని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి రైతులకు నరకం చూపించిందని, అభివృద్ధి పేరుతో విధ్వంసం మాత్రమే జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Also Read: IND vs SA: 408 పరుగుల భారీ తేడాతో ఓటమి .. భారత్ చెత్త రికార్డు

ఈ సందర్భంగా ఆలయ విస్తరణ పనుల వివరాలు వెల్లడించారు. మొదటి దశలో రూ.140 కోట్లతో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, మహా ప్రాకారం నిర్మాణం, ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలు చేపడతారు. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి గృహాలు, అర్చకులు–సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మండపం, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు.

మునుపటి టిడిపి ప్రభుత్వం 2014–19లో ఈ ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దానిని రూ.36 కోట్లకు తగ్గించిందని సీఎం విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఆ ప్రణాళికను మించి సకల సదుపాయాలతో ఆలయాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించిందని తెలిపారు.

తిరుపతి ప్రాంగణం ఎలా ఉంటుందో, అదే తరహాలో అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని, ఇదే దేవతల రాజధాని అమరావతి నమూనాగా ఎదుగుతుందని సీఎం భావించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం, సంపద కలగాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దేవాలయ నిర్మాణంలో దాతలు ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. చివరగా “ఓం నమో వేంకటేశాయ” అంటూ ఉపన్యాసాన్ని సీఎం ముగించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణతో రాజధానికి కొత్త ఉజ్వల అధ్యాయం మొదలవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *