White House: వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ దగ్గర జరిగిన కాల్పులతో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో జరిగిన ఈ దాడి దేశాన్ని కుదిపేసింది. అధ్యక్ష భవనం సమీపంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో నేషనల్ గార్డ్ సిబ్బంది తీవ్రంగాయపడ్డారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని తెలిపారు.
దుండగుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతను అఫ్గానిస్థాన్‌కు చెందిన రహ్మనుల్లా లకాన్వాల్‌గా గుర్తించారు. 29 ఏళ్ల ఈ వ్యక్తి 2021లో అఫ్గాన్ సంక్షోభం సమయంలో ప్రత్యేక వీసాతో అమెరికాలోకి వచ్చినట్లు విచారణలో బయటపడింది. వైట్‌హౌస్‌ను లక్ష్యంగా చేసుకుని అతడు కాల్పులు ప్రారంభించినట్లు అధికారులు వివరించారు. మొదట ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపి, తరువాత మరొక గార్డుపై దాడి చేసినట్లు సమాచారం.
Also Read: Arvind Dharmapuri: 42 శాతంలో సగం కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది దేశంపై చేసిన ఉగ్రదాడి అని వ్యాఖ్యానించిన ఆయన, దాడికి పాల్పడిన వ్యక్తిని విద్వేషంతో నిండిన ఉగ్రవాది అని పేర్కొన్నారు. అలాగే ఈ సంఘటనకు జో బైడెన్ పాలన సమయంలో అమెరికాలోకి వచ్చిన వలసదారులే కారణమని పరోక్షంగా విమర్శలు చేశారు. బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై మళ్లీ సమగ్ర విచారణ అవసరం ఉందని అన్నారు.
భద్రతను మరింత బలపర్చేందుకు అదనంగా 500 మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్ ప్రాంతంలో మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితుడు అఫ్గాన్ శరణార్థిగా గుర్తించబడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల ఘటనపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఉన్న ధైర్యవంతులకు ఇలా జరగడం బాధకరమన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ దాడిని ఖండించారు. అమెరికాలో హింసకు చోటు ఉండకూడదని, గాయపడిన సైనికుల కోసం ప్రార్థనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

