Greater Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GMC) పరిధిని భారీగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విలీన ప్రక్రియ, అధికారాల బదిలీతో కూడిన కీలక ఉత్తర్వులు త్వరలో అమల్లోకి రానున్నాయి.
ORR వరకు విస్తరించనున్న GMC
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత పటిష్టం చేసేందుకు, ఔటర్ రింగ్‌రోడ్డు (ORR) చుట్టూ ఉన్న 20 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్లను పూర్తిగా జీఎంసీ (బల్దియా)లో విలీనం చేయనున్నారు. ఈ విలీన ప్రక్రియ పూర్తయితే, జీఎంసీ పరిధి సుమారు 2 చదరపు కిలోమీటర్ల వరకు అదనంగా పెరగనుంది. ఈ మార్పుతో, ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతం మొత్తం ఇకపై జీఎంసీ అధికార పరిధిలోకి రానుంది.
ఇది కూడా చదవండి: Telangana 10th Exams: స్టూడెంట్స్ కు అలర్ట్.. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్!
భవన నిర్మాణాలకు బల్దియానే అధికారం
ఈ విలీనానికి సంబంధించిన చట్ట సవరణ తర్వాత, నగరంలో నిర్మాణ అనుమతుల విషయంలో కీలక మార్పు రానుంది. లేఅవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతులను ఇకపై పూర్తిగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషనే (GMC) మంజూరు చేస్తుంది.ఔటర్ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత మాత్రమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అధికార పరిధి మొదలవుతుంది.
HMDA పరిధిలో తగ్గింపు, జిల్లా విస్తరణ
ఒక వైపు GMC పరిధి పెరుగుతుండగా, మరోవైపు HMDA పరిధిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తాజా విలీనాల కారణంగా, HMDA పరిధి నుంచి సుమారు 1400 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం GMC పరిధిలోకి తగ్గనుంది. అయితే, అంతకుముందే ప్రభుత్వం HMDA పరిధిని 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 10,472 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు 7 జిల్లాల పరిధిలో ఉన్న HMDA, ఈ విస్తరణతో ఇప్పుడు 11 జిల్లాలకు విస్తరించింది.
ఈ కీలకమైన మార్పులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో పరిపాలనా సౌలభ్యం, పౌర సేవలు మరియు పట్టణ ప్రణాళికలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి.
