Habsiguda: పదో తరగతి పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక, తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హబ్సిగూడ ప్రాంతంలో నివాసముంటున్న, ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలిక.. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివాస భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు, ఆ విద్యార్థిని ఇటీవల సరిగా చదవటం లేదని, దీనిపై ఆమె తల్లిదండ్రులు మందలించారని తెలుస్తోంది. తల్లిదండ్రుల మందలింపును తీవ్రంగా తీసుకున్న విద్యార్థిని మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Karimnagar: దుబాయిలో రెండేళ్లుగా ఆచూకీ లేదు.. భర్త కోసం కలెక్టర్కు మొరపెట్టుకున్న భార్య!
చదువుల ఒత్తిడి కారణంగా బాలిక బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థులు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

