Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. రాబోయే 2026 సంవత్సరంలో, డిసెంబర్ 30 (2025) నుంచి జనవరి 8 (2026) వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

సామాన్య భక్తులకు పెద్దపీట
ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. పది రోజుల పాటు మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో దాదాపు 164 గంటలు కేవలం సామాన్య భక్తులకు సర్వదర్శనం (Sarvadarshanam) కోసం కేటాయించారు.

అత్యంత రద్దీగా ఉండే మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మూడు రోజులు కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

Also Read: CP Sajjanar: రౌడీషీటర్ల ఇళ్లలో దూరి సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్!

టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు
గతేడాది తిరుపతిలోని కౌంటర్ల వద్ద టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట (Stampede) వంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ఈసారి టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు చేసింది.

ఆఫ్‌లైన్ రద్దు: భక్తులు ఆఫ్​లైన్​లో కౌంటర్ల వద్ద తీసుకునే సర్వదర్శనం టోకెన్లను పూర్తిగా రద్దు చేశారు. భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్​లోనే టోకెన్లు తీసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ-డిప్ విధానం: మొదటి మూడు రోజుల (డిసెంబర్ 30, 31, జనవరి 1) సర్వదర్శనం టోకెన్లను ‘ఈ-డిప్’ (E-Dip) అనే లాటరీ విధానం ద్వారా కేటాయించనున్నారు.

రిజిస్ట్రేషన్ వివరాలు: ఈ టోకెన్ల కోసం భక్తులు నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 1 వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

టోకెన్ల కేటాయింపు: డిసెంబర్‌ 2న ఆన్‌లైన్ డిప్‌ ద్వారా టోకెన్లను కేటాయించి, టీటీడీ వెబ్‌సైట్, యాప్, వాట్సాప్ ద్వారా మాత్రమే భక్తులకు జారీ చేస్తారు.

సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సులభంగా కల్పించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ తెలియజేసింది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందే ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *