Droupadi Murmu: భారతదేశ చరిత్రలో ఒక అరుదైన స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి, దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా ప్రసిద్ధి చెందిన బసంత్ పాండో (81)కు, నవంబర్ 20న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ పర్యటనకు వచ్చిన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసే భాగ్యం లభించింది. ఇటీవల స్థానిక మీడియాలో బసంత్ పాండోకు సంబంధించిన కథనాలు ప్రచురితం కావడంతో ఈ అరుదైన చారిత్రక భేటీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
బసంత్ పాండో జీవితం 1952లో జరిగిన ఒక మధురమైన సంఘటనతో ముడిపడి ఉంది. నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సర్గుజా జిల్లాలోని అంబికాపుర్‌లో పర్యటించి, స్థానిక పాండో గిరిజన తెగ ప్రజలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అప్పటికి కేవలం 8 ఏళ్ల వయసులో ఉన్న బసంత్‌ను రాజేంద్రప్రసాద్ గారు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అంతేకాక, ఈ బాలుడికి బసంత్ అనే పేరు కూడా ఆయనే పెట్టడం జరిగింది. అప్పటి నుంచి బసంత్ పాండో అంబికాపుర్ ప్రాంతంలో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా ప్రసిద్ధి చెందారు.
Also Read: Prashant Kishor: బిహార్ ఎన్నికల ఫలితాలు: రిగ్గింగ్ జరిగిందనే నమ్ముతున్నాను – ప్రశాంత్ కిశోర్
నవంబరు 20న అంబికాపుర్‌కు విచ్చేసిన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన బసంత్ పాండో, తొలి రాష్ట్రపతితో తనకున్న ఈ చారిత్రక బంధాన్ని రాష్ట్రపతి ముర్ముకు వినయంగా వివరించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరునవ్వుతో స్పందిస్తూ, “నువ్వు నాకూ కుమారుడివే” అని ఆప్యాయంగా పలకరించారని బసంత్ వెల్లడించారు. ఈ భేటీతో బసంత్ పాండో దేశ చరిత్రలో మరొక మధుర జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు.
ఈ ప్రత్యేక భేటీ సందర్భంగా బసంత్ పాండో తన గిరిజన తెగ, ఇతర గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన 5 కీలక డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. తొలి గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము తమ వినతులను సానుకూలంగా పరిశీలిస్తారని స్థానిక గిరిజన సమాజం గట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

