Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు నవంబర్ 23న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల తుది జాబితాను అధికారులు నిర్ణయించనున్నారు. ఈ మేరకు పంచాయతీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జీవో 46ను తీసుకొచ్చింది. ఆర్డీవో పరిధిలో, వార్డుల రిజర్వేషన్లను మండల పరిషత్ అధికారుల పరిధిలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను కేటాయించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు రిజర్వేషన్ల జాబితాను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీచేశారు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మార్గదర్శకాలు ఇవే..
రిజర్వేషన్ కేటాయింపునకు ఎస్ఈఈపీసీ-2024 జనాభా లెక్కల ఆధారంగా మార్గదర్శకాలు
సర్పంచ్ రిజర్వేషన్‌కు 2011 జనగణన మరియు ఎస్ఈఈపీసీ-2024 జనాభా డేటా వినియోగం
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ప్రభుత్వం జీవో 46లో స్పష్టం
గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/ గ్రామాలు అదే అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదు.
వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో సమక్షంలో.. సర్పంచ్ రిజర్వేషన్ బాధ్యత ఆర్డీవోల సమక్షంలో
రిజర్వేషన్లలో జనాభా నిష్పత్తిని అవరోహణ క్రమంలో కేటాయించాలి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు
100 శాతం గిరిజన గ్రామాల్లో అన్ని వార్డులు/ సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్
2018 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించవచ్చు.
ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, ఆ తర్వాతే ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించాలి
మహిళా రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలి
గ్రామ పంచాయతీ/ వార్డుల సంఖ్య తక్కువైతే తొలుత మహిళ ఆ తర్వాత లాటరీ పద్ధతి

