Shiva Jyothi: ప్రముఖ యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, ఆమె తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన మాటల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఆమె ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్గా మారింది.
అసలు వివాదం ఏమిటంటే..
యాంకర్ శివజ్యోతి ఇటీవల తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం క్యూలో ఉన్నప్పుడు ఆమె, ఇక్కడ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు మండిపడుతూ, శివజ్యోతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ ఎదురుకావడంతో యాంకర్ శివజ్యోతి ఒక వీడియోలో తన తప్పును అంగీకరించారు. ఆమె మాట్లాడుతూ, “పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి, హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా సారీ చెప్తున్నాను” అన్నారు.
Also Read: CM Revanth Reddy: పుట్టపర్తిలో సీఎం రేవంత్రెడ్డి: సత్యసాయి సేవలు ప్రభుత్వాల కంటే గొప్పవి
ఆమె తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ, తాను ‘రిచ్’ అని అన్నది రూ.10,000 విలువైన ఎల్1 క్యూ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతో కాదని, కేవలం కాస్ట్లీ (విలువైన) క్యూలైన్లో నిలబడిన ఉద్దేశంతో మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. “నా ఇంటెన్షన్ తప్పు కాదు, కానీ నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం” అని ఆమె ఒప్పుకున్నారు.
తనకు వేంకటేశ్వరస్వామి అంటే ఎంత ఇష్టమో సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారికి తెలుసని శివజ్యోతి తెలిపారు. తాను గత నాలుగు నెలలుగా శనివారపు వ్రతాలు చేస్తున్నానని, అంతేకాకుండా తన బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదమే అని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నా జీవితాన్నే మార్చిన వేంకటేశ్వరస్వామిపై నేనెలా కామెంట్స్ చేస్తా? తెలిసో తెలియకో మాట్లాడినందుకు నా తమ్ముడి తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నా” అని అన్నారు.
కేసులు పెడతారనే భయంతో కాకుండా, తనకే ఆ మాటలు తప్పుగా ఉన్నాయనే ఫీలింగ్ రావడంతోనే క్షమాపణలు చెబుతున్నానని శివజ్యోతి క్లారిటీ ఇచ్చారు. టీటీడీ సభ్యులు, భక్తులు, తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరినీ క్షమించాలని కోరుతూ, మళ్లీ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు. ఈ క్షమాపణల వీడియోతో ఈ వివాదం తాత్కాలికంగా ముగిసినట్లే కనిపిస్తున్నా, కొంతమంది భక్తులు మాత్రం మాట్లాడే ముందు జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.
Sorry 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/LDyEbt9YJT
— Shiva Jyothi (@iamshivajyothi) November 22, 2025
