CM Revanth Reddy: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా పాల్గొనడం తనకు దక్కిన ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
ప్రేమతో మనుషులను గెలిచిన మహనీయుడు
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతోనే ప్రజల హృదయాలను గెలిచారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయి నిరూపించారని, ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు. మానవ సేవ అంటే మాధవ సేవ అని బోధించడమే కాకుండా, దాన్ని సంపూర్ణంగా నమ్మి, ఆచరించి చూపారని సీఎం అన్నారు. ప్రపంచంలోని కోట్లాది మందికి ఆయన జీవితంపై ఒక స్పష్టతను ఇచ్చి, వారి లక్ష్యాన్ని చేరడానికి ధైర్యాన్ని అందించారని తెలిపారు. భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో ఆయన సేవలు విస్తరించడం ద్వారా మానవాళికి సేవలు అందిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
Also Read: Equestrian League Final: ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలేలో వైఎస్ జగన్, కేటీఆర్‌ల సందడి
ప్రభుత్వాలకు మించిన సేవ
ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో చేయలేని పనులను సత్యసాయి ట్రస్టు ప్రజలకు సేవలు అందిస్తూ నెరవేర్చిందని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ప్రతి ఒక్కరికీ చదువు అందించాలని సత్యసాయిబాబా బలంగా నమ్మేవారని గుర్తు చేస్తూ, కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. కేవలం విద్య మాత్రమే కాకుండా, మరణం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించడం ద్వారా వారి దృష్టిలో బాబా దేవుడిగా కొలవబడుతున్నారని సీఎం అన్నారు.
ముఖ్యంగా, తన సొంత జిల్లా అయిన పాలమూరు (మహబూబ్‌నగర్) వంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి తాగునీటి సదుపాయం కల్పించారని సీఎం గుర్తు చేశారు. పాలమూరుతో పాటు పుట్టపర్తి ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలోనూ తాగు నీటి సమస్యను పరిష్కరించి, మనందరి మనసుల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

