AUS vs ENG: యాషెస్ 2025 సిరీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు అంచనాలకు మించి శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియగా, ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అనూహ్య విజయంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సంచలన శతకం కీలక పాత్ర పోషించింది.
ట్రావిస్ హెడ్ విధ్వంసం: టీ20 తరహా సెంచరీ
ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ట్రావిస్ హెడ్ టీ20 మ్యాచ్ తరహాలో చెలరేగిపోయాడు. అతను కేవలం 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 123 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా విజయాన్ని సునాయాసం చేశాడు. హెడ్ కేవలం 36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా, ఆ తర్వాత 69 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ వేసిన 17వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి నాలుగు బౌండరీలు, ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ (51*) కలిసి రెండో వికెట్‌కు 92 బంతుల్లో 117 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లబుషేన్ కూడా అర్ధ శతకంతో మెరిశాడు.
ఈ టెస్టు మ్యాచ్ తొలి రోజునే మొత్తం 19 వికెట్లు పడటం గమనార్హం. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణించాలని భావించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో గస్ అట్కిన్సన్ (37), ఓలీ పోప్ (33), బెన్ డకెట్ (28) మాత్రమే కొంత పోరాటం చేశారు. చివరికి ఇంగ్లాండ్ జట్టు కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా తరఫున పేసర్లు బోలాండ్ (4/33), మిచెల్ స్టార్క్ (3/55), డాగెట్ (3/51) అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. చివరికి, 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి, యాషెస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

