Weather: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం మధ్య ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) అంచనాల ప్రకారం, ఈ వ్యవస్థ రాబోయే రోజుల్లో మరింత బలపడనుంది.
రెండు రోజుల్లో వాయుగుండంగా పరివర్తన
దక్షిణ అండమాన్ సముద్రంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన ఈ అల్పపీడనం, నవంబర్ 24, సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు చేరుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు ఈ వాయుగుండం తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, నైరుతి బంగాళాఖాతంలో మరింత బలం పుంజుకుంటుందని తెలియజేశారు. దీని ప్రభావంతో వాయుగుండం క్రమంగా తుఫాన్‌గా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్‌కు సెన్యార్ అనే పేరు వచ్చే అవకాశం ఉందని అంచనా.
Also Read: CM Chandrababu: కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే 48 గంటల్లో ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
