Telangana Politics:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం కీలక మలుపు తిరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Telangana Politics:మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆ మూడు నెలల్లోగా ఆ 10 మందిని స్పీకర్ విచారించకపోయినా, కొందరిని మాత్రం విచారించి, కోర్టును గడువు కోరారు. అయితే స్పీకర్ ఆలస్యం చేయడంపైనా బీఆర్ఎస్ పార్టీ మరో పిటిషన్ దాఖలు చేసింది.
Telangana Politics:ఇదే సమయంలో బహిరంగ ఆధారాలున్న ఓ ఇద్దరు ఎమ్మెల్యేల అంశం మాత్రం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు దారితీసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు మరోసారి తాజాగా స్పీకర్ నోటీసులు పంపారు. దీనిపై ఆ ఇద్దరూ స్పందించారు. ఈ మేరకు ఏకంగా కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి గడువు కోరినట్టు తెలిసింది. దానం కూడా అధిష్టానం వద్ద ఓ అంశాన్ని ఉంచినట్టు తెలిసింది.
Telangana Politics:ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. అదే విధంగా వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కూతురు ప్రచార సభల్లో కడియం శ్రీహరి పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలపై ఏకంగా సంతకం చేయడం కూడా ఆధారంగా ఉన్నది. ఈ రెండు ఆధారాలతో వారిద్దరూ దోషులుగా తేలే అవకాశం ఉన్నది.
Telangana Politics:ఇదిలా ఉండగా నవంబర్ 23లోగా వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహరికి నోటీసులను జారీ చేశారు. దీంతో వారిద్దరూ తమ భవిష్యత్తుపై కాంగ్రెస్ అధిష్టానం వద్ద కోర్కెలను అమలు చేసుకునే పనిలో పడ్డారు. ఈ లోగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మరో పదవిలో ఉనికిలో ఉండేలా కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తున్నది.
Telangana Politics:రాజ్యసభ సీటు అయినా ఇవ్వండి, లేకుంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని దానం నాగేందర్ కాంగ్రెస్ అధిష్టానం ముందు తన కోరికను వెల్లడించినట్టు తెలిసింది. లేదంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మళ్లీ తనకే టికెట్ ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనలను ఉంచినట్టు ప్రచారం జరుగుతుంది.
Telangana Politics:మరోవైపు కడియం శ్రీహరి కూడా ఇలాంటి ప్రతిపాదనలతోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే స్పీకర్‌ను కలిసి మరికొంత గడువు కావాలని కోరారు. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. రాజీనామాకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరూ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

