Top Maoists Surrender

Top Maoists Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట అగ్రనేతల సరెండర్

Top Maoists Surrender: దండకారణ్యాల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతూ, కీలక నాయకత్వాన్ని కోల్పోయి కుదేలవుతున్న మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేతలతో సహా మొత్తం 37 మంది కీలక సభ్యులు ఈరోజు (నవంబర్ 22, 2025) తెలంగాణ డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోబోతున్నారు.

లొంగుబాటు వివరాలు: అగ్రనేతలు ఎవరు?

లొంగిపోతున్న వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ముఖ్యనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతల్లో ఆజాద్ ఒకరు. ఉద్యమంలో పురోగతి సాధించడం అసాధ్యమని గ్రహించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆజాద్‌తో పాటు రమేష్, అప్పాశి నారాయణ, ఎర్రాలు వంటి కీలక సభ్యులు, అలాగే దాదాపు 20 మంది డివిజన్ ఏరియా కమిటీ (DAC) సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లొంగుబాటు ప్రక్రియతో మావోయిస్టు పార్టీ సంస్థాగత బలం గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Srivari Brahmotsavam: హరీష్ రావుకు ప్రత్యేక ఆహ్వానం..

డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం

ఈ భారీ లొంగుబాటు కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కార్యాలయంలోని టెన్నిస్ కోర్టు గ్రౌండ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు. లొంగిపోయిన వారి వివరాలు, వారిపై ఉన్న కేసులు, పునరావాస పథకాలపై డీజీపీ మీడియాకు వివరించే అవకాశం ఉంది.

ఆపరేషన్ కగార్ & మావోయిస్టుల గడ్డు కాలం

‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) వంటి ఉధృతమైన ఆపరేషన్లతో మావోయిస్టు ఉద్యమం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ ఏడాదిలో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లింది.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, మరియు హిడ్మా వంటి కీలక నేతలను మావోయిస్టులు కోల్పోయారు.

పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితులను తట్టుకోలేక అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న గతంలోనే లొంగిపోయారు. అనారోగ్య కారణాల వల్ల చంద్రన్న, బండి ప్రకాశ్‌ వంటి ముఖ్య నేతలు కూడా ఆయుధాలు వీడారు. ఈ నేపథ్యంలోనే, మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఈ భారీ సంఖ్యలో లొంగుబాటు జరగడం గమనార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *