Smriti Mandhana: టీమ్ఇండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానకు ఆమె ప్రియుడు పలాశ్ ముచ్చల్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన మరుక్షణమే ఈ మధుర ఘట్టం డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ ప్రేమ సన్నివేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్మృతి మంధానకు స్టేడియంలోనే సర్ప్రైజ్ ప్రపోజల్
ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న తర్వాత, డీవై పాటిల్ స్టేడియంలోనే ఈ ప్రత్యేక ఘట్టం ఆవిష్కృతమైంది. స్మృతి మంధాన ప్రియుడు పలాశ్ ముచ్చల్, స్మృతిని ఆశ్చర్యపరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
పలాశ్ ముందుగా స్మృతి కళ్లకు గంతలు కట్టి ఆమెను మైదానం మధ్యలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆ గంతలు తీయగానే, ఆయన మోకాళ్లపై నిల్చొని తనదైన శైలిలో ఆమెకు ఉంగరం బహూకరిస్తూ తన ప్రేమను వ్యక్తం (ప్రపోజ్) చేశారు. ఈ ఊహించని సర్ప్రైజ్తో స్మృతి భావోద్వేగానికి లోనై, ఆనందంతో పలాశ్ ప్రేమను అంగీకరించింది. వెంటనే వారిద్దరూ కౌగిలించుకుని ఉంగరాలు మార్చుకున్నారు.
Also Read: ENG vs AUS: నేటి నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మహాపోరు!
ఈ హృదయపూర్వక సన్నివేశాన్ని పలాశ్ ముచ్చల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, నెటిజన్లు ‘క్యూటెస్ట్ ప్రపోజల్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారత బ్యాట్స్‌మెన్స్ జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ సహా పలువురు స్మృతి సహచర క్రికెటర్లు, పలాశ్ స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. వారంతా కలిసి ఈ నవ జంటను అభినందించారు. పలాశ్ సోదరి, ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ కూడా ఈ వేడుకలో పాల్గొని సంబరాన్ని రెట్టింపు చేశారు.
ఈ జంట ఈ నెల 23న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో, దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ జీవితంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఈ స్టార్ జంటకు ప్రధాని ప్రత్యేకంగా ఒక లేఖ రాసినట్లు సమాచారం.
