Vizianagaram: సాధారణంగా వ్యాపారాలు పెంచుకోవడానికి దుకాణదారులు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అయితే, ఓ చికెన్ సెంటర్ యజమాని మాత్రం చాలా విభిన్నంగా ఆలోచించి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పాత ఒక్క రూపాయి నోటు తీసుకువచ్చిన వారికి అర కిలో చికెన్ ఉచితంగా ఇస్తానని బోర్డు పెట్టాడు. ఇంకేముంది? ఈ ఆఫర్ గురించి తెలిసిన జనాలు షాపు ముందు క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ అరుదైన ఆఫర్ విజయనగరం జిల్లాలోని రాజాం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ యజమాని శ్రీనివాసరావు పెట్టింది. తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, అందరి దృష్టిని ఆకర్షించడానికి శ్రీనివాసరావు ఈ వినూత్నమైన ప్రయోగం చేశాడు. ఆయన ఆఫర్ ప్రకటించిన వెంటనే, ఒక్క రూపాయి నోటు ఉన్నవారంతా చికెన్ సెంటర్‌కు పరుగులు తీశారు. కొందరు ఏకంగా 5 నుంచి 10 నోట్లు తెచ్చి చికెన్ పట్టుకుపోయారు కూడా! ఒక్క రోజులోనే ఆ యజమానికి వందకు పైగా పాత రూపాయి నోట్లు వచ్చాయంటే ఈ ఆఫర్ ఎంతగా సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, యజమాని శ్రీనివాసరావుకు ఈ పాత రూపాయి నోట్లతో చికెన్ ఇవ్వడం వెనుక ఒక మంచి ఆలోచన ఉంది. ఈ నోట్లను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలు తయారు చేసే వ్యాపారం చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇలా ఒకే దెబ్బకు రెండు లాభాలు అన్నట్లుగా, చికెన్ వ్యాపారాన్ని పెంచుకుంటూనే, తన కొత్త వ్యాపారానికి కావాల్సిన ముడిసరుకును కూడా సమకూర్చుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్త అంతటా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

