Telangana Tourism: ప్రకృతిని ప్రేమించేవారికి, ఆధ్యాత్మిక యాత్రికులకు తెలంగాణ టూరిజం బోర్డ్ ఒక మంచి కబురు చెప్పింది. ఎంతో మంది పర్యాటకులు ఇష్టపడే నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 22వ తేదీ నుండి మళ్లీ ప్రారంభించనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ప్రతి సంవత్సరం భక్తులు మరియు ప్రయాణికుల కోసం ఈ లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ లాంచీ ప్రయాణం దట్టమైన నల్లమల అటవీ అందాల మధ్య, కృష్ణానది పరవళ్లను చూస్తూ సాగే ఆరు గంటల ప్రయాణం. సుమారు 110 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణంలో… నాగార్జున సాగర్ నుండి బయలుదేరి నందికొండ, ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమల అద్భుతమైన దృశ్యాలను చూస్తూ పర్యాటకులు ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు మధ్యలో భోజన ఏర్పాట్లు కూడా టూరిజం అధికారులు కల్పిస్తారు.
ఈ అద్భుతమైన ప్రయాణం కోసం టికెట్ ధరలను కూడా టూరిజం శాఖ నిర్ణయించింది.
* సాగర్ నుండి శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చేందుకు: పెద్దలకు రూ.3,250, పిల్లలకు రూ.2,600.
* కేవలం సాగర్ నుండి శ్రీశైలం వరకు మాత్రమే: పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600.
ఈ నెల 22వ తేదీ నుండి ప్రతి శనివారం టికెట్లు బుక్ చేసుకున్న వారి సంఖ్యను బట్టి లాంచీ ప్రయాణం మొదలవుతుంది. అయితే, ఎవరైనా సోమవారం నుండి శుక్రవారం మధ్యలో కనీసం 100 టికెట్లు బుక్ చేసుకుంటే, వారి కోసం ప్రత్యేకంగా నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుందని టూరిజం బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.

