Earthquake: బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న భూకంపం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఢాకాకు సమీపంలో నమోదైన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదు కావడంతో, అక్కడి ప్రాంతాల్లో భూమి బలంగా కంపింది. ఉదయం 10 గంటల తర్వాత ఏర్పడిన ఈ ప్రకంపనల ప్రభావం కొద్ది నిమిషాల్లోనే పశ్చిమబెంగాల్ వరకు చేరింది.
కోల్‌కతా, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో 10:09 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నివాస భవనాలు, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో సుమారు 18 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్టు స్థానిక సమాచారం చెబుతోంది. సిలిగురి, జల్పైగురి, కూచ్‌బెహార్, మాల్డా, దక్షిణ దినాజ్‌పూర్ ప్రాంతాల్లో కూడా భూమి జల్లుమన్నట్లు అనేక నివేదికలు వెల్లడించాయి.
Also Read: Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025: మెక్సికో భామ ఫాతిమా బాష్
యూఎస్ జియోలాజికల్ సర్వే విడుదల చేసిన వివరాల ప్రకారం, భూకంప కేంద్రం ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో గుర్తించబడింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు పేర్కొన్నారు. ఢాకాలో ఉదయం 10:08 గంటల సమయంలో భూకంపం నమోదు కావడంతో కొన్ని క్షణాల పాటు నగరం అంతా ఆందోళన వాతావరణం నెలకొంది.
భూకంపం ప్రభావం కారణంగా ఢాకా వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్–ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్ కూడా కొద్దిసేపు నిలిచిపోయింది. ప్రకంపనలు తగ్గిన తర్వాత మ్యాచ్‌ను తిరిగి కొనసాగించారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. భారత్‌లోనూ ఈ ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయి. కోల్‌కతా సహా ఈశాన్య భారతంలోని గువాహటి, అగర్తల, షిల్లాంగ్ వంటి ప్రధాన నగరాల్లో కూడా భూమి కంపించింది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారని, భూకంప మూలాన్ని పూర్తిగా విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.

