Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రీయ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ ప్రక్రియ కారణంగా రాష్ట్రంలో బూత్ స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది మానవతా ఖర్చుగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జల్పాయ్గురిలోని మాల్బజార్లో SIR విధులకు సంబంధించిన ఒత్తిడి కారణంగానే ఒక BLO ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సీఈసీ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. గతంలో మూడేళ్లు పట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియను, ఎన్నికల సంఘం కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంతో, BLOలు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని దీదీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: ఆ పాట పెడితేనే భోజనం చేసేవాడు.. చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన మెగాస్టార్
సరైన ప్రణాళిక, తగినంత శిక్షణ లేదా స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ గందరగోళంగా మారిందని ఆమె విమర్శించారు. ఆన్లైన్ డేటా ఎంట్రీలో సమస్యలు, సర్వర్ వైఫల్యాల కారణంగా ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ హడావుడి సవరణ వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా ఓటర్ల జాబితా విశ్వసనీయత దెబ్బతింటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అస్తవ్యస్తమైన, బలవంతపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, సరైన శిక్షణ, సహకారం అందించాలని, పద్దతిని, గడువును పూర్తిగా పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి సీఈసీని డిమాండ్ చేశారు. బెంగాల్లో జరుగుతున్న ఈ SIR ప్రక్రియను మమతా బెనర్జీ గతంలో ఓట్బందీగా అభివర్ణించారు, ఇది సూపర్ ఎమర్జెన్సీ లాంటిదని విమర్శించారు.

