Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఈ రోజు నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కవిత ఆందోళనకు దిగారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నేతృత్వంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది.
కవితతో పాటు ఆందోళనలో పాల్గొన్న హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య సహా పలువురు ముఖ్య నాయకులను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సింగరేణి భవన్‌ను ముట్టడించడానికి కవిత వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే అక్కడ పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల వైద్య అవసరాల కోసం వెంటనే ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఉన్నప్పటికీ, కవిత మాత్రం వారి కళ్లుగప్పి తెలివిగా ఆటోలో సింగరేణి భవన్ వద్దకు చేరుకుని, ముట్టడికి ప్రయత్నించడం అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.

