Egg Price

Egg Price: సామాన్యుడికి షాక్: కోడి గుడ్ల ధరలు మళ్లీ పైపైకి.. డజను ధర ఎంతంటే?

Egg Price: కార్తీక మాసం దాదాపు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, మార్కెట్‌లో నిత్యావసరాల ధరల మోత ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కూరగాయలు, గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరల పెరుగుదలకు వ్యాపారులు, దళారులు మెంథా తుపానును సాకుగా చూపుతూ విపరీతమైన దందా నడిపిస్తున్నారు.

గుడ్డు ధరల పెరుగుదల విడ్డూరం
సాధారణంగా శ్రావణం, కార్తీక మాసాలలో మాంసాహార వినియోగం తగ్గిపోతుంది. ఈ సమయంలో గుడ్లు, మాంసం ధరలు తగ్గుముఖం పట్టడం ఆనవాయితీ. కానీ, ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకవైపు కిలో చికెన్ ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు తగ్గి రూ. 240 నుంచి రూ. 260 మధ్య అమ్ముడవుతుంటే, గుడ్డు ధర మాత్రం విచిత్రంగా పైపైకి దూసుకెళ్లింది.

Also Read: Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఆరుగురు మృతి

గత నెలలో రూ. 5 నుంచి రూ. 6 వరకు పలికిన ఒక్కో గుడ్డు ధర ఇప్పుడు రూ. 7 నుంచి రూ. 8కి చేరింది. దీంతో డజను గుడ్లు ఏకంగా రూ. 98 వరకు పలుకుతున్నాయి. కార్తీక ఉపవాసాలు, అయ్యప్ప దీక్షల సమయం కావడంతో గుడ్ల వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, ధరలు ఇంతగా పెరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

సెంచరీ కొట్టిన కూరగాయలు
గుడ్ల ధరలే కాకుండా, కూరగాయల ధరలు కూడా సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కార్తీక మాసం ఆరంభానికి ముందు కిలో రూ. 20కి అమ్మిన చాలా రకాల కూరగాయల ధరలు ఇప్పుడు ఏకంగా వంద రూపాయలకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దళారులు ధరలను విపరీతంగా పెంచేసి, అడిందే ఆటగా మార్చేశారు. ఈ ధరల మోత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా కొనసాగుతోంది. నిత్యావసరాల ధరలు పెరగడం, కొనే మార్గం లేకపోవడంతో సామాన్యులు తీవ్ర అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *