Telangana Cabinet

Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం జరిగిన సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజాపాలన వారోత్సవాలు’ నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ వారోత్సవాలు ముగిసిన వెంటనే, అంటే డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు (సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ) సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి సుమారు 20 నెలలు పూర్తయిన నేపథ్యంలో, ఎన్నికలను ఇక ఆలస్యం చేయకుండా త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా, తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రజాపాలన వారోత్సవాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో, అదే జోష్‌ను గ్రామ స్థాయి కేడర్‌లో నింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: Parthasarathi: పరకామణి చోరీ కేసు: సీఐ సతీశ్ మృతి పై వైసీపీ ఎందుకు అధిక ఉత్సాహం?

ఈ సమావేశంలో సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కూడా మంత్రివర్గం సంతాపం వ్యక్తం చేసింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని నిర్ణయించింది. అంతేకాక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని కేబినెట్ సూచించింది. మరణించిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకోసం ఒక్కో బాధిత కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *