Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ దుర్ఘటనపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బాధితులకు ఆర్థిక సాయం, సౌదీకి ప్రతినిధి బృందం
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో పాటు బాధితులకు సహాయం అందించేందుకు తక్షణమే ఒక ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపించాలని నిర్ణయించారు. ఈ ప్రతినిధి బృందంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఉంటారు.
Also Read: Borabanda: బోరబండలో తీవ్ర ఉద్రిక్తత: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు
అంత్యక్రియలపై కీలక నిర్ణయం
ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కేబినెట్ ఆదేశించింది.
ప్రమాదం వివరాలు: 45 మంది మృతి
సోమవారం తెల్లవారుజామున (సుమారు 1:30 గంటలకు) ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు సజీవ దహనమై, దాదాపు 45 మంది మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు, వీరిలో విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది ఉండడం విషాదకరం.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడింది.
