Pujara: సొంతగడ్డపైనా ఓటమి షాక్: జట్టులో ఏదో తీవ్రమైన లోపం ఉందని పుజారా వ్యాఖ్య

Pujara: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టులో భారత్‌ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో, అదీ తక్కువ లక్ష్యాన్ని చేధించలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ ఛటేశ్వర్‌ పుజారా జట్టు ప్రదర్శనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి కారణం జట్టులో జరుగుతున్న ట్రాన్సిషన్ ఫేజ్ కాదని, అసలు సమస్య వేరే ఉందని ఆయన స్పష్టం చేశారు.

జియోస్టార్ కార్యక్రమంలో మాట్లాడుతూ పుజారా ఇలా అన్నారు:“విదేశాల్లో ఓటములు వచ్చినప్పుడు మార్పుల దశ కారణం అంటాం. కానీ స్వదేశంలో ఓడిపోవడానికి అది కారణం కాదు. జట్టులో ప్రతిభ కొరత ఏ మాత్రం లేదు.”

యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్ గిల్‌, వాషింగ్టన్ సుందర్‌ వంటి క్రికెటర్లు అద్భుతమైన ఫస్ట్‌క్లాస్ రికార్డులు కలిగి ఉండగా, ఇంతటి ప్రతిభ ఉన్న జట్టు స్వదేశంలోనే చతికిలపడడంపై పుజారా ఆందోళన వ్యక్తం చేశారు.

పిచ్‌పై కూడా పుజారా అసంతృప్తి

ఈడెన్ పిచ్‌ తొలి రోజు నుంచే ఎక్కువ టర్న్‌, అనూహ్య బౌన్స్ ఇస్తోందని, ఇలాంటి వికెట్‌పై బ్యాటర్ల టెక్నిక్ బలహీనపడటం సహజమేనని అన్నారు. కానీ:“ఓటమికి పూర్తి బాధ్యత మాత్రం బ్యాటర్లపైనే ఉంది” అని స్పష్టం చేశారు.

స్వదేశంలో ఇలాంటి క్లిష్ట పిచ్‌లు తయారు చేయడం వల్ల గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని, భారత బలం బ్యాటింగ్ కావడంతో దానికి అనుకూలమైన పిచ్‌లు అవసరమని సూచించారు.“ఇండియా-ఏ కూడా సౌతాఫ్రికాను ఓడించే స్థాయిలో ఉంది”

భారత క్రికెట్ ప్రతిభపై మాట్లాడుతూ:

“మన ఇండియా-ఏ జట్టు కూడా ఇక్కడ సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును ఓడించగలదు. అలాంటప్పుడు సీనియర్ జట్టు ఓటమికి ఆటగాళ్ల సామర్థ్యం కారణమని చెప్పడం సరికాదు.”అని పుజారా అభిప్రాయపడ్డారు.

రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి

మొదటి టెస్టులో ఓటమితో భారత్‌ సిరీస్‌లో వెనుకబడింది. గౌహతిలో జరిగే రెండో టెస్టులో వ్యూహాలు మార్చి తప్పక విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా చేసిన సూచనలు, విమర్శల నేపథ్యంలో జట్టు యాజమాన్యం తమ వ్యూహాలను సమీక్షించే అవకాశం ఉంది..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *