Sheikh Hasina: ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) తనకు మరణశిక్ష విధించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని, పూర్తిగా పక్షపాతంతో, రాజకీయ ప్రేరేపితంగా ఇవ్వబడిందని ఆమె ఆరోపించారు.
గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన అల్లర్ల కేసులో ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు’ పాల్పడినట్లు తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని షేక్ హసీనా స్పష్టం చేశారు. “ఎన్నిక కాని ప్రభుత్వం నాపై కుట్రపూరితంగా తప్పుడు తీర్పు ఇప్పించింది. నన్ను అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ తీర్పు వెలువడింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సమయంలో తనను తాను నిరూపించుకోవడానికి న్యాయస్థానం న్యాయమైన అవకాశం ఇవ్వలేదని, న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష: ఐసీటీ సంచలన తీర్పు!
మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తన ప్రభుత్వంపై ICT చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని హసీనా అన్నారు. తన పాలనలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి అంశాలపై ఎన్నో కీలక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అంతేకాక, మయన్మార్‌లో హింసకు గురై బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించామని, మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని ఆమె ప్రశ్నించారు. 2010లోనే బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా నడిపించింది తమ ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు.
ICT తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌లో బంద్ వాతావరణం నెలకొంది. షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లోని ఢిల్లీలో ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
