Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష: ఐసీటీ సంచలన తీర్పు!

Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మరణశిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. 2024 ఆగస్టులో తన ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థి నిరసనలపై ఆమె ఆదేశించిన దాడుల్లో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో 458 పేజీల సుదీర్ఘ తీర్పును ఐసీటీ ప్రకటించింది.

మానవత్వానికి మాయని మచ్చ
గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో రాజధాని ఢాకాలో జరిగిన ఆందోళనల అణచివేత సమయంలో దాదాపు 1400 మంది అమాయకులు మరణించినట్లు ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. నిరసనకారులను చంపేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ దారుణాలు జరిగాయని కోర్టు పేర్కొంది. హసీనా చర్యలు మానవత్వానికి మాయని మచ్చ అని న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని, ఆగస్టు 5న నిరసనకారులపై ఆర్మీ కాల్పులు, హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. అంతేకాక, గాయపడిన వారికి చికిత్స అందించడాన్ని నిరాకరించడం హేయమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

మాజీ హోంమంత్రికి కూడా ఉరిశిక్ష
ఈ కేసులో షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే, పోలీస్ మాజీ చీఫ్ చౌధురీ అబ్దుల్లా అల్‌-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే జాతీయ ఎన్నికలకు ముందు ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Also Read: AP News: ఏపీ రైతులకు డబుల్ ధమాకా: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ

ప్రస్తుతం 78 ఏళ్ల షేక్ హసీనా, గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. విచారణకు హాజరు కావాలని కోర్టు పదేపదే ఆదేశించినా ఆమె లెక్కచేయలేదు. తనపై వచ్చిన ఆరోపణలను “న్యాయశాస్త్ర హాస్యం”గా ఆమె కొట్టిపారేశారు. తీర్పు వెలువడటానికి ముందు, ఆమె సోషల్ మీడియా ద్వారా తన మద్దతుదారులైన అవామీ లీగ్ కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. తాను బతికే ఉన్నానని, దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడని, అప్పటివరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆమె అన్నారు. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై, ముఖ్యంగా యూనస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, తన పార్టీని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒకవేళ తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశం మొత్తం లాక్‌డౌన్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వాహనాలు తగలబెట్టడానికి లేదా బాంబులు విసిరేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, వారిపై వెంటనే కాల్పులు జరపాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *