Supreme Court: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా నిర్ణయం తీసుకోని తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తూ, తదుపరి చర్యలపై సంచలన హెచ్చరికలు చేసింది.
ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మళ్లడం తెలిసిందే. ఈ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు (కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు) దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జూలై 31, 2025న స్పీకర్‌ను మూడు నెలల్లోగా ఆదేశించింది. అయితే, ఆ గడువు పూర్తయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Varanasi: వారణాసి గ్లింప్స్‌లో సీక్రెట్ డీటెయిల్స్.. మైండ్ బ్లోయింగ్ హింట్స్!
మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి బెంచ్ స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. స్పీకర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గీలు స్పందిస్తూ, ఇంకో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకుంటామని నివేదించారు. అయితే, కోర్టు సంతృప్తి చెందలేదు.
రాజ్యాంగ రక్షణ లేదు, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి!
సుప్రీంకోర్టు స్పీకర్‌కు అల్టిమేటం ఇస్తూ సంచలన హెచ్చరిక చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే స్పీకర్ కోర్టు ధిక్కారణకు సిద్ధం కావాలి. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేం ముందే చెప్పాం. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి. అంటూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌కు కోర్టు ధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాత చేపడతామని తెలిపింది.
ఎమ్మెల్యేలు ఎవరంటే?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు వీరే: దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్ళం వెంకటరావు, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కాలే యదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
