Nagarjuna Akkineni: టాలీవుడ్‌కు కొన్నాళ్లుగా పెనుసవాల్‌గా మారిన పైరసీ భూతాన్ని కట్టడి చేయడంలో హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయానికి సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ నేపథ్యంలో, అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు సోమవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పోలీసుల చొరవకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అతని నుండి సేకరించిన కీలక సమాచారంతో మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఉచిత సినిమా కాదు, డేటా చోరీ! – నాగార్జున కీలక వ్యాఖ్యలు
సీపీ సజ్జనార్‌తో భేటీ అనంతరం మాట్లాడిన నాగార్జున, తెలంగాణ పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పైరసీ వల్ల కలిగే నష్టం కేవలం సినీ పరిశ్రమకే కాదని, వీక్షకుల వ్యక్తిగత డేటాకు కూడా ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు.
ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వగానే, చెన్నై నుంచి ఒక వ్యక్తి నాకు కాల్ చేసి మాట్లాడారు. ఇక్కడ (చెన్నైలో) మేము చేయలేని పనిని మీ తెలంగాణ పోలీసులు చేసి చూపించారని గర్వంగా చెప్పాడు. ఇది మన పోలీసులకు దక్కిన గొప్ప గుర్తింపు.
ఇది కూడా చదవండి: Varanasi: వారణాసి గ్లింప్స్‌లో సీక్రెట్ డీటెయిల్స్.. మైండ్ బ్లోయింగ్ హింట్స్!
ఐబొమ్మ రవి ఏకంగా 50 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటాను చోరీ చేశాడు. వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. పైరసీ వెబ్‌సైట్లు కేవలం సినిమాలు మాత్రమే చూపించడం లేదు, మీ డేటాను దోచుకుంటున్నాయి అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి.
ఆరు నెలల క్రితం, మా కుటుంబ సభ్యుడు ఒకరిని సైబర్ నేరగాళ్లు రెండు రోజులపాటు ‘డిజిటల్ అరెస్ట్’ లో పెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మా వాళ్ళని సురక్షితంగా కాపాడారు.
డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చుని ఉచితంగా సినిమా చూస్తున్నాం అని మాత్రం ఎవరూ అనుకోకండి. మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటా మొత్తాన్ని ఈ పైరసీ కేటుగాళ్లు సేకరిస్తున్నారు. ఈ డేటా చోరీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైరసీ భూతం నుంచి సినీ పరిశ్రమను రక్షించిన తెలంగాణ పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
