Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు చాలా ఎక్కువగా పెరుగుతోంది. ఈ చలికి రాష్ట్ర ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి ఎక్కువైంది. ఈ పరిస్థితిని చూసి వాతావరణ అధికారులు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.
ఇంకాస్త పెరిగే అవకాశం!
రాబోయే రెండు, మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని కోహిర్, వికారాబాద్ జిల్లాలోని యాలాల్‌లలో అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి.
ప్రజలు భయాందోళన
సిద్దిపేట జిల్లా అంతటా చలి పులిలా గాలిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే, మరోవైపు చలి వణికిస్తోంది. నవంబర్ నెలలోనే ఇంత చలి ఉంటే, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం కార్మికులు, ఇతర ప్రజలు స్వెటర్లు వేసుకుని పనులకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి, వారు బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా స్వెటర్లు, క్యాప్‌లు ధరించాలని సూచిస్తున్నారు.

