KTR

KTR: ఫలితాలొచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ గూండాయిజం

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజం మొదలుపెట్టిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన గట్టిగా ఖండించారు.

జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన BRS కార్యకర్త రాకేశ్‌ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. తాము కూడా గతంలో ఎన్నో ఎన్నికల్లో గెలిచామని, కానీ ఎప్పుడూ ఇలాంటి హింసకు పాల్పడలేదని చెప్పారు. విజయ గర్వంతోనే కాంగ్రెస్ వాళ్లు ఈ శుక్రవారం ఊరేగింపులు చేస్తూ తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.

BRS కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి గెలిచిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ గూండాయిజం ఇలాగే కొనసాగితే, ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాకేశ్‌కు ప్రస్తుతం ఎస్ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *